ఘట్‌కేసర్, వెలుగు : లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన సాయికుమార్ (26)కు ఏడాది కిందే పెండ్లి కాగా ఓ కుమార్తె ఉంది. కుటుంబఅవసరాల కోసం తన భార్య పేరుతో లోన్ యాప్‌లో సుమారు రూ. లక్ష లోన్ తీసుకున్నాడు. మొత్తం డబ్బులు చెల్లించినప్పటికీ ఇంకా కట్టాలని లోన్ యాప్ ఏజెంట్లు సాయికుమార్‌పై ఒత్తిడి తెచ్చారు.
రోజూ ఫోన్ చేస్తూ అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు అతడి భార్య ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో బయట మరికొందరి వద్ద అప్పు చేసి లోన్ కట్టినా వారి వేధింపులు ఆగలేదు. ఓ వైపు లోన్ యాప్ నిర్వాహకులు వేధిస్తుండగా.. మరోవైపు బయట అప్పు ఇచ్చిన వారు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయికుమార్ ఘట్‌కేసర్ సమీపంలోని కొండాపూర్‌లో ఉన్న ఓ వెంచర్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన ఫ్రెండ్స్‌కు మెసేజ్ చేశాడు. సమాచారం అందుకున్న ఘట్‌కేసర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
